No Result
View All Result
ఎందుకో గాని.. జూనియర్ ఎన్టీఆర్ NTR మాత్రం తెలుగుదేశం పార్టీ అగ్రనేతలను..ప్రధానంగా చంద్రబాబు బహిరంగ సభల్లో, నారా లోకేష్ యువగళం పాదయాత్రలోనూ వదలడం లేదు. జూనియర్ రాజకీయాల్లో రావాలంటూ ఆయన అభిమానులు పదే పదే కోరుతున్నారు. అది కుప్పం అయినా వారికి ఒకటే. గన్నవరం అయినా ఒకటే. ఎక్కడైనా అదే నినాదం. అవే పోస్టర్లు.తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఇది ఆనందకరంగా ఉన్నప్పటికీ నేతలకు మాత్రం ఇబ్బందికరంగానే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ రావాలని నియోజకవర్గ నేతల మనసులో కోరుకుంటున్నా అధినాయకత్వం మాత్రం జూనియర్ ను దరి చేరనివ్వడం లేదు.
పార్టీకి వ్యతిరేకం కాకున్నా…
అలాగని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదు. తన తాత స్థాపించిన పార్టీకి ఆయన మద్దతు ఉంటుందని వివిధ సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దయెత్తున సభల్లో నినాదలు వినిపిస్తున్నాయి. పోస్టర్లు, ఫ్లెక్సీల రూపంలో కనిపిస్తున్నాయి. ఇది నేతలకు ఇబ్బందికరంగా మారాయి.
చంద్రబాబు సభల్లోనూ పలు చోట్లు ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తుండటంతో ఆయన ఒకానొక దశలో విసుగు చెందారు.గుడివాడ నుంచి కుప్పం పర్యటనలోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జెండాలు, ఫ్లెక్సీలతో కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు వేసి తమకు తాము ఆనందపడుతున్నారు. కానీ జూనియర్ మాత్రం తనకు రాజకీయాలపై ఎలాంటి ఇష్టం లేదని పదే పదే చెబుతున్నా ఆయన అభిమానులు మాత్రం ఊరుకోవడం లేదు.
యువగళంలోనూ…NTR
తాజాగా తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో సాగుతున్న సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ఫ్యూచర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ అనేక చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. నిజానికి గన్నవరం ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఆప్తుడు.
ఆయన అనుచరులు ఈ ఫ్లెక్సీలు వేసి ఉంటారని తొలుత భావించినా చివరకు అది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పనేనని తేలింది. ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేష్ ల ఫొటోలు మాత్రం లేవు. ఫ్లెక్సీలో పెట్టిన నినాదం కూడా పార్టీకి, లోకేష్ కు కొంత డ్యామేజీ కలిగించే విధంగా ఉండటం చర్చనీయాంశమైంది. బాపులపాడు మండలం రంగన్న గూడెంలో ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. ఈ ఫ్లెక్సీలు తొలగించాలని తెలుగుదేశం పార్టీ నేతలు భావించినా అందుకు కొందరు అడ్డుపడటంతో పాదయాత్ర వచ్చే సమయానికి తొలగించలేకపోయారు
నేతలకు తలనొప్పి…
ఈ ఫ్లెక్సీలో టీడీపీ అగ్రనేతల ఫొటోలు లేకపోవడం ఒకటయితే..”యువగళమైనా.. జనగళమైనా.. నవగళమైనా.. ఏ గళమైనా… తెలుగు నాట స్మరించే పేరు ఒక్కటే నందమూరి తారకరామారావు” అంటూ అందులో రాయడంతో నేరుగా లోకేష్ యువగళాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసినట్లయింది.
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ పదే పదే చెబుతున్నా ఆయన అభిమానులు మాత్రం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. జూనియర్ ఫ్లెక్సీలను యువగళం పర్యటించే ప్రాంతంలో ఏర్పాటు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.NTR
No Result
View All Result