సీనియర్ నేత,మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అయోమయంలో పడినట్లయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొలిటికల్ గా నష్టపోయిన తెలంగాణ నేతల్లో నాగం జనార్థన్ రెడ్డి ఒకరు. రెండు ఎన్నికల నుంచి ఆయన ఓటమి పాలవుతున్నారు. శాసనసభ గడప తొక్కలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అన్ని పార్టీలు మారేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు సందేహంగా మారింది. చివరి వరకూ నాగంకు టిక్కెట్ టెన్షన్ తప్పేట్లు లేదు.
విభజనకు ముందు…
నాగం జనార్థన్ రెడ్డి రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే మంత్రి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రారాజుగా మెలిగారు. కానీ దశాబ్దకాలం నుంచి ఆయన టైం రాజకీయంగా బాగాలేనట్లుంది. రాష్ట్ర విభజన తర్వాత సొంత పార్టీ పెట్టారు. తర్వాత ఆ పార్టీని మూసేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ నాగం జనార్థన్ రెడ్డి ఇమడలేక పోయారు. దీంతో దానిని వదిలి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. గతంలో తాను టీడీపీలో ఒకవెలుగు వెలిగినప్పుడు రేవంత్ రెడ్డి అసలు టీడీపీలోనే లేరు. అలాంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు నాగం జనార్థన్ రెడ్డి పనిచేయాల్సి వస్తోంది.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా…
ఇక నాగర్ కర్నూలు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్థన్ రెడ్డి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనే చివరి గెలుపు. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. డాక్టర్ గా మంచి పేరున్న నాగం జనార్థన్ రెడ్డి రాజకీయ వేత్తగా కూడా ప్రజల్లో మంచి పేరే సంపాదించుకున్నారు. కానీ 2014, 2018 ఎన్నికల్లో ఆయనను నాగర్ కర్నూలు ప్రజలు ఆదరించలేదు. అధికార టీఆర్ఎస్ పార్టీకే అక్కడ పట్టం కట్టడంతో ఈసారైనా తన రాజకీయ భవిష్యత్ ను మార్చుకోవాలని నాగం తెగ ప్రయత్నిస్తున్నారు. అక్కడే తిష్ట వేసి ప్రజలతో మమేకం అవుతున్నారు.
కూచుకుళ్ల చేరికతో….?
కానీ నాగం జనార్థన్ రెడ్డికి ఈసారి కూడా టిక్కెట్ కన్ఫర్మ్ గా వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. అందుకు కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతుండటం ఆయనకు ఇబ్బందికరంగా మారనుంది. కూచుకుళ్ల కేవలం నాగర్ కర్నూలు టిక్కెట్ కోసమే పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో నాగం భవితవ్యం ఏమవుతుందోనన్న ఆందోళన ఆయన అనుచరుల్లో నెలకొంది. హైకమాండ్ మాత్రం సర్వే నివేదికలకు అనుగుణంగా టిక్కెట్ కేటాయింపు జరుగుతుందని చెబుతున్నారు. మొత్తం మీద నాగం జనార్థన్ రెడ్డికి ఈసారి నాగర్ కర్నూలు టిక్కెట్ వస్తుందా?రాదా? అన్నది చివరిక్షణంలోనే తేలనుంది.