నాగభైరవ జయప్రకాష్ నారాయణ. ఆయన రాజకీయ నాయకుడికంటే ముందు ఒక ఐఏఎస్ అధికారి. ఆయనను గురించి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని అడిగితే చెబుతారు. ఆయన ఎంత జనం మనిషో. రైతుల కోసం నాడు ప్రకాశం కలెక్టర్ జయప్రకాష్ నారాయణ చేసిన సేవలను ఇప్పటికీ మరచిపోరు. తమ తర్వాత తరానికి కూడా జేపీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయన ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వం ఇచ్చే ఒక జీతం తప్ప ఎవరి దగ్గర చేతులు చాచని అధికారి. ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండే ఆయనను ఇప్పటికీ ప్రకాశం జిల్లా రైతాంగం జేపీని మరచి పోలేరంటే అతి శయోక్తి కాదు.
రాజకీయాల్లోకి వచ్చి…
ఆయన రాజకీయాల్లోకి వచ్చి మాటలు పడుతున్నారు కాని లేకుంటే ఆయన ఐఏఎస్ అధికారిగా జిల్లాలతో పాటు రాష్ట్రానికి చేసిన సేవలను కూడా మరచిపోలేనివి. అలాంటి జయప్రకాష్ నారాయణ లోక్‌సత్తా పార్టీని పెట్టారు. తొలి నాళ్లలో ఆయన పార్టీని ఆదరించారు. అయితే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టారన్న ప్రచారం జరిగింది. కానీ ఇవేమీ పట్టించుకోలేదు. పార్టీని పెట్టారు. అదీ జనానికి సేవ చేయడం కోసమే. ఆయన పార్టీకి నేతల కొదవకూడా లేదు. అవినీతిని రూపుమాపేందుకు వచ్చిన అధికారిగానే ఆయనను జనం చూశారు.
కూకట్పల్లి నుంచి
2009 ఎన్నికల్లో ఆయన కూకట్పల్లి నియోజకవర్గంలో లోక్‌సత్తా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. శాసనసభలో తన వాణిని వినిపించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించి తెలంగాణ ప్రజల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. నాడు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో ఆయనపై దాడి జరిగినా ఏ రాజకీయ పార్టీ కూడా ఆయన వెన్నంటి నిలవలేదు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. తాను రాజీకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కూడా తెలిపారు. అదే ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు మొదటిది.. చివరిది. అప్పటి నుంచి టీవీ మీడియా చర్చలకే పరిమితమవుతు తన అభిప్రాయాలను కుండబద్దలు కొడుతున్నారు.
టీడీపీ ట్రోలింగ్…
అంతవరకూ బాగానే ఉంది. రెండు మూడు రోజుల క్రితం ఆయన విజయవాడ వెళ్లారు. అదే ఆయన పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు కారణమయింది. రైతుల పట్ల అపార అభిమానం ఉన్న జయప్రకాష్ నారాయణ ఆప్కాబ్ వజ్రోత్సవాలకు హాజరయ్యారు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకోరు. కానీ అక్కడ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. జయప్రకాష్ నారాయణను సాదరంగా ఆహ్వానించారు. వేదికపై తన పక్కన కూర్చుండబెట్టుకుని ముచ్చటించారు. అదే ఇప్పుడు జేపీ పాలిట శాపమయింది. ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నంత మాత్రాన నేరంగా భావిస్తూ అనేక మంది ట్రోలింగ్ చేస్తున్నారు. జేపీ ఇంతగా దిగజారిపోయడేంటంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జేపీని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ ఓన్ చేసుకునే యత్నం…
అదే సమయంలో వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాలో తమకు అనుకూలంగా కథనాలు రాసేస్తున్నారు. వైసీీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏ స్థానం నుంచి జేపీ పోటీ చేస్తారో కూడా వైసీీపీ శ్రేణులు చెబుతున్నారు. కానీ జయప్రకాష్ నారాయణ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. ఆయన మాట మీద నిలబడే మనస్తత్వం ఉన్న మనిషి. కేవలం పదవుల కోసం ఆయన ఎవరితోనూ లాలూచీ పడరన్న నిజాన్ని తెలుసుకుంటే మంచిది. ఆప్కాబ్ రైతులకు ఉద్దేశించింది కాబట్టి ఆయన అటెండ్ అయి ఉండవచ్చు. అంతే తప్ప అందులో నిజం లేదు. అలాగని ఈ ట్రోలింగ్‌కు ఆయన జవాబు చెప్పుకునే పరిస్థిితి ఉండదు. అందుకే ఒకరిని ట్రోల్ చేసేటప్పుడు ఆ మనిషి వ్యక్తిత్వాన్ని తెలియకుంటే తమ పెద్దలను అడిగి తెలుసుకోవడం ఈ తరానికి మంచిది.