బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని రెండో దఫా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తూ అన్ని పార్టీలను కలుపుకునే పోయే ప్రయత్నంలో ముందస్తు చర్యల్లో భాగంగా వరస సమావేశాలను నిర్వహిస్తుంది. పార్లమెంటు సమావేశాలలో ఐక్యత చాటుతూ అధికార పార్టీని ఇరుకున పెట్టాలన్న ప్రయత్నంలో విపక్షాలున్నాయి.
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…
మోదీ ప్రభుత్వం కొనసాగితే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదకరంగా మారుతుందని పలు పార్టీల నేతలు ధ్వజెమెత్తారు. తమకు అడ్డుగా వచ్చే పార్టీ నేతలను ఈడీ, సీబీఐ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి పారిశ్రామికవేత్తలకే మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దేశ ప్రజల ఆలోచనలలో మార్పు కనిపిస్తుందని, ఈ సమయంలో ఐక్యతగా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మోదీ మరోమారు గద్దెనెక్కకుండా నిలువరించగలమన్న ధీమాను అనేక పార్టీల నేతలు వ్యక్తం చేశాయి.
ప్రధాని పదవికి…
ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ కు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని తెలిపారు. అధికారం కాంగ్రెస్ కు ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యాన్ని దేశంలో కాపాడటమే తమ పార్టీ ఉద్దేశ్యమని ఖర్గే వివరించారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాద్యత అందరిపైనా ఉందన్న ఖర్గే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై సంఘటితంగా అందరం కలసి పోరాడాలని ఆయన పిలుపు నిచ్చారు.