సినిమాలను రాజకీయాల్లో కలపవద్దని పవన్ కల్యాణ్ పార్టీ అధికార ప్రతినిధులను కోరారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు వేరు. సినిమాలు వేరని అన్నారు. సినిమాలు తనకు అవసరమని అన్నారు. పార్టీని నడపటానికి సినిమాలు తనకు ఇంధనమని తెలిపారు. అధికార ప్రతినిధులు సినిమాలను, రాజకీయాలను కలిపేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని అన్నారు. చర్చల్లోనూ వైసీపీ నేతలు రెచ్చగొట్టినా మీరు సినిమాల జోలికి వెళ్లవద్దని హితవు పలికారు.
సినిమాను, రాజకీయాలను..
“బ్రో” సినిమా వివాదంలో వైసీపీ నేతలు, జనసేన నేతల మధ్య గత వారం రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో జనసేన అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్టీని నడిపేందుకు నిధులు అవసరం కావడంతో తాను సినిమాలు చేస్తున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, రాజకీయాలను, సినిమాలను వేరుగా చూడాలని కోరారు. రాజకీయంగా ఎదగాలంటే మీరు సినిమాల జోలికి వెళ్లవద్దని, మీరు అభిమానులు కాదని అధికార ప్రతినిధులకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లయింది. తనను తిట్టినా ఏం కాదని, వాళ్లు కావాలని డైవర్ట్ చేయడానికి సినిమాలను రాజకీయాల్లోకి చొప్పిస్తున్నారని, వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు.