తెలంగాణ రాష్ఠ్రం ఆవిర్భవించిన తర్వాత రాజకీయం నష్టపోయిన నేతల్లో కోదండరామ్ ఒకరు. రాష్ట్ర్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాలేకపోతే, ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడిన ప్రొఫెసర్ ను మాత్రం జనం ఆదరించడం లేదు. తొలినాళ్లలో ఆయన లేకుండా తెలంగాణ ఉద్యమం నడిచేది కాదు. జేఏసీ ఛైర్మన్ గా అన్ని పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఘనత కోదండరామ్ ది. అనేక కార్యక్రమాలను రూపొందించి ఇటు యువత దగ్గర నుంచి గ్రామీణ స్థాయి వరకూ ఉద్యమాన్ని విస్తరించడంలోనూ ఆయనది ప్రత్యేక పాత్ర. అన్ని రాజకీయ పార్టీలూ ఆయనంటే గౌరవించేవి. ఆయనకు వేదికపై ఉన్నతస్థానాన్ని ఇచ్చి తమ భక్తిని చాటుకునేవి.
ప్రొఫెసర్ గా సక్సెస్…
ప్రొఫెసర్ గా సక్సెస్ అయిన కోదండరామ్ సారు పొలిటికల్ లీడర్ గా మాత్రం విఫలమయ్యారు. గత తొమ్మిదేళ్ల నుంచి ఆయన గెలుపు రుచి చూడలేదు. నీతికి నిజాయితీకి కోదండరామ్ పెట్టింది పేరు. అందరికీ ఆప్తుడిగా నాడు ఉన్న కోదండరామ్ ఇప్పుడు ఎవరికీ కాకుండా పోయారు. పాలిటిక్స్ అంటే అంతేనేమో. గతంలో గ్రామ స్థాయి నుంచి ఆయనకు ఆహ్వానాల మీద ఆహ్వానాలు అందేవి. కానీ నేడు ఆయనను పట్టించుకునే వారే లేరు. చివరకు యువత కూడా పెద్దాయనను పట్టించుకోక పోవడం విచారకరమనే అనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టడం విడ్డూరం కాకపోతే మరేమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేసీఆర్ నుంచి…
తొలుత ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా మెలిగిన కోదండరామ్ తర్వాత ఆయనకు దూరమయ్యారు. తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. తెలంగాణ జనసమితి పేరుతో జనంలోకి వెళ్లారు. ప్చ్… కానీ ఏం లాభం.. ప్రజలు ఆయనను పట్టించుకోలేదు. ఆయన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులెవరికీ డిపాజిట్లు కూడా దక్కలేదు. అంటే ఆయన పరపతి జనంలో ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2018 ఎన్నికల్లో వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీకూడా తమతో కలవాలని ఆహ్వానించాయి. మహాకూటమిలో ఆయనను చేర్చుకున్నాయి. ప్రొఫెసర్ ఉంటే భరోసా అని భావించి కోదండరామ్ సారును చేరదీశాయి. కానీ ఫలితాల తర్వాత మాత్రం విషయం అన్ని పార్టీలకూ అర్థమయినట్లుంది.
ఈసారైనా…?
మహాకూటమి తరుపున పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో ఒక్క స్థానం మినహా ఎక్కడా డిపాజిట్ దక్కలేదు. ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 0.5 శాతం మాత్రమే. దీంతో ప్రొఫెసర్ ను నమ్ముకున్న నేతలు ఒక్కొక్కరూ జారి పోతున్నారు. చివరకు వేళ్ల మీద లెక్కించగలిగిన వారు మాత్రమే మిగిలారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనను కలుపుకునేందుకు ఏ పార్టీ ఇంత వరకూ ప్రయత్నం చేయలేదు. ఆయన కూడా రాజకీయాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో కోదండరామ్ కు రాజకీయాలంటేనే విరక్తి కలిగినట్లు కనపడుతుంది. ప్రొఫెసర్ గా ఆయనను ఇప్పటికీ అభిమానించే యువత లక్షల సంఖ్యలో ఉంది. కానీ ఓటింగ్ కు వచ్చేసరికి మాత్రం ప్రొఫెసర్ గారు పనికిరాకుండా పోయారనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లోనైనా కోదండరామ్ సారు గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి తన గళం విప్పుతారని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి అది జరుగుతుందా? లేదా? అన్నది కాలమే చెప్పాల్సి ఉంటుంది.