(surya namaskar)
సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా, అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు. ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరి జీవితం ఉరుకుల పరుగుల మయంగా మారింది. ఉదయం నిద్రలేచామా హడావిడిగా టిఫిన్ కానిచ్చామా పరుగుపరుగన ఆఫీస్‌కు వెళ్లామా. ఇంటికి వచ్చామా మళ్లీ నిద్రపోయమా అనే తీరుగానే ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్ధితులలో వ్యాయామం చేయడానికి టైమ్ దొరకనే దొరకదు. మనకు సరైన వ్యాయామం లేకపోతే శారీరక సమస్యలే కాదు, మానసిక సమస్యలూ చుట్టుముడతాయి. మన శారీరక, మనసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సూర్య నమస్కారాలు అద్భుతంగా సహాయపడతాయి. సూర్య నమస్కారాలు చేయడానికి గంటల సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. రోజూ సూర్యోదయ సమయంలో 10 నుంచి 15 నిమిషాలు ఇవి ప్రాక్టిస్ చేస్తే చాలు. సూర్య నమస్కారం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, కండరాలు, కీళ్లను బలపరుస్తుంది. సూర్య నమస్కారం జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది, నిద్రలేమిని దూరం చేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
12 భంగిమలు కలిపి ఒక వృత్తం (surya namaskar)
సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. నమస్కారాసనం, అర్ధచంద్రాసనం, పాద హస్తాసనం, అశ్వసంచాలనాసనం, పర్వతాసనం, సాష్టాంగ నమస్కారాసనం, భుజంగాసనం, భూకంపాసనం, అశ్వసంచాలనాసనం, పాద హస్తాసనం, వృక్షాసనం, నమస్కారాసనం. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్ తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి. ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతో పాటు సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో మెలుచేస్తాయి.
మెరుగైన జీర్ణ క్రియ కోసం… (surya namaskar)
రోజూ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేస్తే.. జీర్ణవ్యవస్థ పనితీరుకు మేలు చేస్తుంది. ఇది పేగులలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థ మృదువైన పనితీరును నిర్ధారిస్తుంది. శరీరాన్ని ముందుకు వంచడం, సాగదీయడం వల్ల.. పొత్తికడుపుపై ఒత్తిడి పడుతుంది. ఇది కడుపులో చిక్కుకున్న గ్యాస్ తేలికగా బయటకు వెళ్లేలా సహాయపడుతుంది. రోజూ సూర్య నమస్కారం చేస్తే అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి.
బరువు తగ్గుతారు…
సూర్యనమస్కారం క్రమం తప్పకుండా చేస్తే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఒక సెట్ సూర్య నమస్కారం చేస్తే సుమారు 13.90 కేలరీలు బర్న్ అవుతాయి. ఐదు సెట్ల నుంచి 12 సెట్లకు పెంచడం వల్ల 416 కేలరీలు బర్న్ అవుతాయి. సూర్యనమస్కారాలు పొత్తికడుపు ప్రాంతాన్ని సాగదీయడం, కుదించడం, మెలితిప్పడం చేస్తాయి. ఇవి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి అదనపు కేలరీలు, కొవ్వును బర్న్ చేస్తుంది. సూర్యనమస్కారాలు వేగంగా చేయడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. మన డైలీ రొటీన్లో సూర్య నమస్కారాలు చేర్చుకోవడం వల్ల మన శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరం పోషక శోషణ సామర్థ్యాన్ని పెంచుతూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారం శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది, అదనపు కార్బన్ డయాక్సైడ్ను బయటకు విడుదల చేస్తుంది.
పీసీఓడీ తగ్గిస్తుంది.
సూర్యనమస్కారాలు 12 వారాల పాటు 10- 15 నిమిషాలు చేస్తే సాధారణ వ్యాయామాల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్య నమస్కారాలు లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆడవారిలో క్రమం తప్పిన పీరియడ్స్ ను సమయానికి వచ్చేలా చేస్తాయి. సూర్య నమస్కారం ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పీసీఓడికు ఒత్తిడి హార్మన్ పెరగడం కూడా ఓ కారణం. పీసీఓడీతో బాధపడే మహిళలు క్రమతప్పకుండా సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
స్ట్రెస్ తగ్గాలంటే….
సూర్య నమస్కారాలు ఎండోక్రైన్ గ్రంధుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది ఒత్తిడి-హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన తగ్గుముఖం పడతాయి. సూర్యనమస్కారాలలోని లోతైన శ్వాస ప్రక్రియలు నాడీ కణాలను రిలాక్స్ చేస్థాయి. ఇవి భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచుతాయి. రోజూ సూర్య సమస్కారాలు చేయడం వల్ల సృజనాత్మకత కూడా పెరుగుతుంది. సూర్య నమస్కారం జుట్టు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది స్కాల్ప్, ఫాలికల్స్ కు మెరుగైన రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. జుట్టు రాలడం, పొడిబారడం, బాలమెరుపు వంటి సమస్యలు దూరం అవుతాయి.
చర్మం మెరుస్తుంది…
సూర్య నమస్కారాలు సౌందర్య సంరక్షణలోనూ సహాయపడతాయి. ఈ ఆసనాలు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖానికి ప్రకాశవంతమైన కాంతిని అందిస్తాయి. ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. సూర్యనమస్కారాలు నిద్రను ప్రేరేపిస్తాయి, విశ్రాంతిని అందిస్తాయి, జీర్ణక్రయను మెరుగుపరుస్తుంది. ఇవన్నీ మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. సూర్యనమస్కారాలు వేగంగా చేస్తే చెమట ఎక్కువగా పడుతుంది. చెమట ద్వారా చర్మంలో పేరుకున్న వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి. చర్మం తాజాగా మారుతుంది.
వీళ్లు చేయకూడదు…
గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయకూడదు. హైపర్‌టెన్షన్, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు ఉన్నవారు, గతంలో స్ట్రోక్‌కు గురైనవారు సూర్యనమస్కారాలు వేయకూడదు. వెన్నునొప్పి, మెడనొప్పి ఉన్నవారు ఈ ఆసనాలు వేసే ముందు డాక్టర్‌ను సంప్రదించడం మేలు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పి ఉన్నవారు సూర్యనమస్కారాలు చేయవద్దు.
(surya namaskar)