తుమ్మల నాగేశ్వరరావు.. రెండు తెలుగు రాష్ట్ర్రాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. తెలుగుదేశం పార్టీ నేతగా, తర్వాత బీఆర్ఎస్ నేతగా అందరికీ సుపరిచితులు. ఖమ్మం జిల్లాలో సీనియ్ మోస్ట్ లీడర్ ఎవరంటే తుమ్మల పేరే ఎవరైనా చెబుతారు. ఆయన చుట్టూనే ఖమ్మం రాజకీయాలు తిరిగేవి. నడిచేవి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు మంత్రివర్గంలో తుమ్మలకు ఖచ్చితంగా ఒక ప్లేస్ ఉండేది. అలా ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించిన తుమ్మల నాగేశ్వరరావు గత ఐదేళ్లుగా ఏ పనిలేకుండా ఉండిపోయారు. తన మిత్రుడైన కేసీఆర్ కూడా ఆయనకు ఏ పదవి ఇవ్వలేదు.
సీనియర్ నేతగా…
తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా కమ్మ సామాజికవర్గంలో ఆయన ప్రభావం చెప్పలేనిది. తుమ్మలను దగ్గరకు తీసుకుంటే ఆ వర్గం ఓట్లన్నీ వచ్చేసినట్లేనని గులాబీ బాస్ భావించేవారు. 2014లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఓటమి పాలయిన తుమ్మల నాగేశ్వరరావు వెంటనే అప్పటి టీఆర్ఎస్ లో చేరిపోయారు. కేసీఆర్ కూడా భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని సాదరంగా ఆహ్వానించారు. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్సీని చేశారు. తన మంత్రివర్గంలో చోటిచ్చి పక్కన స్థానం కల్పించారు. అనంతరం పాలేరు ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయించి గెలుపొందడంతో తుమ్మల సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభం అదిరిందనే చెప్పాలి.
నాలుగున్నరేళ్ల నుంచి…
అయితే 2018 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరావు తిరిగి పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా బరిలోకి దిగి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో పాలేరు నియోజకవర్గం ఇప్పుడు ఖాళీలేదు. ఖమ్మం పట్టణంలో పోటీ చేయాలన్నా అక్కడ పువ్వాడ అజయ్ పాతుకుపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఐదేళ్ల కాలంలో అనేక ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినప్పటికీ కేసీఆర్ మాత్రం తుమ్మల వైపు చూడలేదు. అంటే.. ఆయనను పక్కన పెట్టారా? లేదా? రానున్నఎన్నికల్లో పోటీ చేయించడానికి ఖాళీగా ఉంచారా? అన్నది తుమ్మల అనుచరుల్లో చర్చనీయాంశమైంది.
పదవి దక్కుతుందా?
మొన్నటి వరకూ తన పని తాను తుమ్మల నాగేశ్వరావు ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యారు. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయనకు ప్రయారిటీ మామూలుగా ఉండదు. పదవి లేకుండా పాలిటిక్స్ చేయడం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే తుమ్మల కూడా ఇన్నాళ్లు అంటీముట్టనట్లు వ్యవహరించారంటారు. ఆయనకు బీఆర్ఎస్ తప్ప వేరే దారి లేదు. ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్లలేని పరిస్థితి. వెళితే గిళితే టీడీపీ తప్ప మరొక పార్టీలో చోటు లేదు. కానీ ఆ పని తుమ్మల చేయరు. ఇంతకీ తుమ్మల నాగేశ్వరావుకు ఈసారైనా కేసీఆర్ టిక్కెట్ ఇస్తారా? లేకుంటే ఏదైనా పదవి ఇస్తారా? అన్న చర్చ ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతుంది. మరి తుమ్మల రాజకీయ నడక ఏవైపు సాగుతుందన్నది చూడాల్సి ఉంది.